Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 3 ఆగస్టు

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 3 ఆగస్టు, 2027

మంగళవారం · సామాన్య కాలం 18వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 18వ వారపు మంగళవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

సంఖ్యా 12:1–13

1మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. 2“యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?” అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు. 3మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు. 4వెంటనే యెహోవా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకి రండి” అన్నాడు. ఆ ముగ్గురూ అక్కడికి వెళ్ళారు. 5అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చాడు. గుడారం ద్వారం దగ్గర నుండి అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. 6యెహోవా ఇలా అన్నాడు. “మీరు ఇప్పుడు నా మాటలు వినండి. మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను. కలల ద్వారా అతనితో మాట్లాడతాను. 7నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. 8నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను. ముఖాముఖీగా మాట్లాడతాను. అతడు నా స్వరూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?” 9యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. 10గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు. 11అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. “అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం. 12తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.” 13కాబట్టి మోషే యెహోవాకు మొర పెట్టాడు. “దేవా, దయచేసి ఈమెను బాగు చెయ్యి” అని ప్రార్ధించాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 51:1–4, 10–11

1ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన. దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి. 2నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. 3నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. 4నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు. 10దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు. 11నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

సువార్త

మత్తయి 14:22–36

22యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు. 23ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది. 25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. 26ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. 28పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. 29యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. 31వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. 32యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. 33అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు. 34వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు. 35అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. 36“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు