Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 12 జులై

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 12 జులై, 2027

సోమవారం · సామాన్య కాలం 15వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 15వ వారపు సోమవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

నిర్గ 1:8–14, 22

8కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు. 9అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు “ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు. 10వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు. 11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. 12ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. 13ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. 14బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి. 22అప్పుడు ఫరో “వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి” అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 124:1–8

1దావీదు రాసిన యాత్రల కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, 2మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, 3వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు. 4నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి. 5జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి. 6వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి. 7వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము. 8భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.

సువార్త

మత్తయి 10:34–11:1

34“నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. 35అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు. 37నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 40మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు. 41ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు. 42శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.” 11:1యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు