హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 13 మే
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 30 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 13 మే, 2027
గురువారం · పాస్కా రెండవ వారం · స్వరం 1
పండుగలు మరియు పరిశుద్ధులు
Holy Apostle James Zebedee, brother of John the Theologian († 44)
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ యాకోబు కోసం)
1దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. 2నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. 5మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. 9దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. 11సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. 12పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ యాకోబు కోసం)
13చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా. 14ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు. 18దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు. 19నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. 20ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు. 21కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. 22వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు. 26తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. 27తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.
సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ యాకోబు కోసం)
1నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి. 2ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. 3మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, 4మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? 5నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? 6కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? 7మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? 8“నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. 9కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. 10ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. 11“వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. 12నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. 13కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.
ఉదయ ప్రార్థన: సువార్త
15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.
పత్రిక
23పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. 24వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు. 25యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? 26ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు. 27ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా 28హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు. 29ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, 30నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ 31వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
పత్రిక (పరిశుద్ధ యాకోబు కోసం)
1ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు. 2యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు. 3ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు. 4అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు. 5పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. 6హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు. 7ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. 8దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. 9అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. 10మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 11పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.
సువార్త
24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు. 26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. 28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు. 30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
సువార్త (పరిశుద్ధ యాకోబు కోసం)
1ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు. 2ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. 3పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు. 4ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు. 5సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. 6వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. 7వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి. 8సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. 9ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. 11వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 30 ఏప్రిల్ పౌర కాలెండర్లో 13 మే. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు