Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 8 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 25 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 8 మే, 2027

శనివారం · ప్రకాశ వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

ప్రకాశ వారపు శనివారం

ఉపవాసం లేని వారం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ మార్కు కోసం)

యాకో 1:1–12

1దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. 2నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. 5మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. 9దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. 11సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. 12పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ మార్కు కోసం)

యాకో 1:13–27

13చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా. 14ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు. 18దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు. 19నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. 20ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు. 21కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. 22వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు. 26తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. 27తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.

సాయంకాల ప్రార్థన: పఠనం (పరిశుద్ధ మార్కు కోసం)

యాకో 2:1–13

1నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి. 2ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. 3మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, 4మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? 5నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? 6కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? 7మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? 8“నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. 9కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. 10ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. 11“వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. 12నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. 13కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

ఉదయ ప్రార్థన: సువార్త (పరిశుద్ధ మార్కు కోసం)

లూకా 10:1–15

1ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు. 2వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. 3మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. 4మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు. 5మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి. 6శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది. 7వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.ఇంటింటికీ తిరగవద్దు. 8మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి. 9ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి. 10ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే, 11మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి, ‘మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి’ అని చెప్పండి. 12తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను. 13“అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు. 14అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది. 15కపెర్నహూమా, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు.

పత్రిక

అపొ.కా 3:11–16

11వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు. 12పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు? 13అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు. 14పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు. 15మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం. 16ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.

పత్రిక (పరిశుద్ధ మార్కు కోసం)

1 పేతు 5:6–14

6అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. 7ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి. 10తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌. 12సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి, అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి. 13బబులోను పట్టణంలో ఉన్న ఆమె (దేవుడు ఎన్నుకున్న ఆమె) మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు మీకు అభినందనలు చెబుతున్నాడు. 14ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.

సువార్త

యోహా 3:22–33

22ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు. 23సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్చోట నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. 24అప్పటికి యోహానును ఇంకా చెరసాల్లో వేయలేదు. 25అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది. 26వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు. 27అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు. 28నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. 29పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.” 31పై నుండి వచ్చిన వాడు అందరికంటే పైవాడే. భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి గనక భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు. 32ఆయన తాను చూసిన వాటిని గురించీ విన్నవాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్షాన్ని అంగీకరించరు. 33ఆయన సాక్షాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు.

సువార్త (పరిశుద్ధ మార్కు కోసం)

మార్కు 6:7–13

7యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. 8“ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి. 9చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి. 11ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.” 12శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. 13ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 25 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 8 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు