Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 7 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 24 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 7 మే, 2027

శుక్రవారం · ప్రకాశ వారం · స్వరం 6

పండుగలు మరియు పరిశుద్ధులు

ప్రకాశ వారపు శుక్రవారం

అతి పరిశుద్ధ దైవజనని జీవదాయక ఊట

ఉపవాసం లేని వారం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

అపొ.కా 3:1–8

1మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. 2పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. 3పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు. 4పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. 5అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. 6అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని 7వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. 8వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.

పత్రిక (దైవజనని కోసం)

ఫిలిప్పీ 2:5–11

5క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి. 6ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు. 7అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు. 8చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు. 9అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

సువార్త

యోహా 2:12–22

12ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు. 13యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 14అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు. 15ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు. 16పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు. 17ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు. 18అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. 19దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. 20అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. 21అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. 22ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.

సువార్త (దైవజనని కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 24 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 7 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు