హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 4 మే
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 4 మే, 2027
మంగళవారం · పాస్కా కాలం ఆరవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
పాస్కా కాలం ఆరవ వారపు మంగళవారం
వారపు రోజు · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
22అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. 23వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. 24అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు. 25మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. 27అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. 28అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. 29చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు. 34అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
ప్రతిస్పందన కీర్తన
1దావీదు కీర్తన నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను. 2నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు. 3నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు. 7నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది. 8యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.
సువార్త
5అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. 6నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది. 7“అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు