హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 5 మే
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 5 మే, 2027
బుధవారం · పాస్కా కాలం ఆరవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
పాస్కా కాలం ఆరవ వారపు బుధవారం
వారపు రోజు · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
15పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు. 22పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను. 23నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను. 24విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు. 26ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే, 28మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు. 29కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు. 30ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.” 32మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు. 33ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 34అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. 18:1ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి. 2ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి. 11భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి. 12యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక. 13ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది. 14ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.
సువార్త
12“నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు