హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 19 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 6 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 19 ఏప్రిల్, 2027
సోమవారం · మహా ఉపవాస కాలం ఆరవ వారం · స్వరం 5
పండుగలు మరియు పరిశుద్ధులు
Holy Hierarch Eutychius, Patriarch of Constantinople († 582)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
17నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను. 18నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది. 19నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు. 20బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి! 21ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి. 22“దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు. 49:1ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు. 2ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు. ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు. 3ఆయన నాతో “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి. నీలో నా ఘనత చూపిస్తాను” అని చెప్పాడు. 4నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది.
సాయంకాల ప్రార్థన: పఠనం
1ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు. 2అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు. 3కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా. 4దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. 5ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు. 6అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో “జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో 7‘నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా’ అన్నాడు. 8కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి. 9నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను. 10నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళు” అంది. 11దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను. 12ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది” అన్నాడు. 13కానీ అతని తల్లి “కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది. 14కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది. 15రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి. 16ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది. 17తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది. 18అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు. 19దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు. 20అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు. 21అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు. 22యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు. 23యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు. 24“నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు. 25అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు. 26అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు. 27యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. 28ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక! 29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.” 30ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు. 31అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు. 32అతని తండ్రి అయిన ఇస్సాకు “నువ్వు ఎవరివి?” అని అడిగాడు. అతడు “నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని” అన్నాడు. 33దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.” 34ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో “నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అన్నాడు. 35ఇస్సాకు “నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు” అన్నాడు. 36ఏశావు ఇలా అన్నాడు. “యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.” ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని “నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?” అని అడిగాడు. 37అందుకు ఇస్సాకు “చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?” అన్నాడు. 38ఏశావు తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అంటూ గట్టిగా ఏడ్చాడు. 39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు. 40నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.” 41యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”
సాయంకాల ప్రార్థన: పఠనం
16ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు. 17పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు. 18అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు. 19పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది. 20సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. 21మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి. 22మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు. 23యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు. 24సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు. 25హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 6 ఏప్రిల్ పౌర కాలెండర్లో 19 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు