Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 18 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 5 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 18 ఏప్రిల్, 2027

ఆదివారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

మహా ఉపవాస కాలం ఐదవ ఆదివారం

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన రెండవ సువార్త

మార్కు 16:1–8

1విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, 3“మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 4వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. 5వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. 6అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. 7మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.” 8ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.

పత్రిక

హెబ్రీ 9:11–14

11అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. 12మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. 13ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే 14ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!

పత్రిక (పరిశుద్ధ మరియ కోసం)

గలతీ 3:23–29

23మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. 24కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది. 25అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. 26యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

సువార్త

మార్కు 10:32–45

32యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు. 33ఆయన, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. 34వారు ఆయనను హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అని వారితో చెప్పాడు. 35జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా! మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా?” అని అడిగారు. 36ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు. 37వారు, “నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో” అన్నారు. 38యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు. 39వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు. 40కాని, నా కుడి వైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి” అన్నాడు. 41ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది. 42అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. 43మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి. 44మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి. 45ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

సువార్త (పరిశుద్ధ మరియ కోసం)

లూకా 7:36–50

36పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. 37ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి 38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది. 39ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, “ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలడు. ఈమె పాపాత్మురాలు” అని తనలో తాను అనుకున్నాడు. 40దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు. 41అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. 42ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు. 43అందుకు సీమోను, “అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. దానికి యేసు, “సరిగ్గా ఆలోచించావు” అని అతనితో చెప్పి, 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. 45నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 46నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. 47దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు. 48తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 49అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. 50అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 5 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 18 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు