Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 19 ఏప్రిల్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 19 ఏప్రిల్, 2027

సోమవారం · పాస్కా కాలం నాల్గవ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా కాలం నాల్గవ వారపు సోమవారం

వారపు రోజు · ఆరాధన రంగు: తెలుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 11:1–18

1యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు. 2పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, 3“నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు. 4అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ, 5“నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది. 6దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి. 7అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. 8అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను. 9రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది. 10ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. 11వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. 12అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. 13అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు. 14నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు. 15నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. 17“కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. 18వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 42:1–2; 43:3–4

1ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది. 2నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను? 43:3నీ వెలుగునూ, నీ సత్యాన్నీ పంపించు. అవి నాకు దారి చూపనీ. అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికీ, నీ నివాసాలకూ నన్ను తీసుకు వెళ్ళనీ. 4అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.

సువార్త

యోహా 10:1–10

1మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. 2ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. 3అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. 4తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. 5వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. 6యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. 7అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. 8నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. 9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు