Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 17 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 4 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 17 ఏప్రిల్, 2027

శనివారం · మహా ఉపవాస కాలం ఐదవ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

అతి పరిశుద్ధ దైవజనని అకాథిస్ట్ శనివారం

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

హెబ్రీ 9:24–28

24అందుచేత చేతులతో నిర్మాణం జరిగి, నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు, ప్రస్తుతం ఆయన మనందరి కోసమూ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకే ప్రవేశించాడు. 25అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని వేరే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అయితే యేసు పదే పదే తనను తాను అర్పించుకోడానికి అక్కడికి వెళ్ళలేదు. 26ఒకవేళ ఆయన పదేపదే అక్కడికి వెళ్ళాల్సి వస్తే భూమి ప్రారంభం నుండి ఆయన అనేకసార్లు హింస పొందాల్సి వచ్చేది. కానీ ఆయన ఈ కాలాంతంలో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసివేశాడు. 27మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది. 28అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.

పత్రిక (దైవజనని కోసం)

హెబ్రీ 9:1–7

1మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. 2ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 3ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 4అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. 5“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. 6వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు. 7కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు.

సువార్త

మార్కు 8:27–31

27యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు. 28అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు. 29“అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు. 30అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు. 31ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”

సువార్త (దైవజనని కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 4 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 17 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు