హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 19 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 6 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 19 మార్చి, 2027
శుక్రవారం · మహా ఉపవాస కాలం మొదటి వారం · స్వరం 8
పండుగలు మరియు పరిశుద్ధులు
42 Martyrs of Ammoria in Phrygia († c. 845): Theodore, Constantine, Aetius, Theophilus, Basoes, Callistus, and others
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
1చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా, 2శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, 3సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలో నుంచి, తీసివేయబోతున్నాడు. 4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. 5ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు. 6ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, ‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు. 7అతడు ఆ రోజున కేక వేసి, ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.” 8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమయ్యింది. 9వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు. 10నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. 11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. 12చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు. 13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. 14యెహోవా తన ప్రజల పెద్దల మీద, వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. “మీరే ద్రాక్షతోటను తినేశారు. మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది.
సాయంకాల ప్రార్థన: పఠనం
20అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. 21అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు. 23ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు. 24ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. 25అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు. 3:1దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది. 4పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. 7అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. 8సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. 9దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. 10అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు. 12ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు. 13దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. 14అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు. 16ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు. 20ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.
సాయంకాల ప్రార్థన: పఠనం
19తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు. 20ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి. 21కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. 22జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. 23అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. 24పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. 25అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. 26యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు. 27అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు. 28నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు. 29నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు. 30నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. 31దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు. 32కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. 33దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు. 34ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 6 మార్చి పౌర కాలెండర్లో 19 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు