Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 18 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 5 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 18 మార్చి, 2027

గురువారం · మహా ఉపవాస కాలం మొదటి వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyr Conon of Isauria (1st C)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 2:11–21

11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 12గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు. 13సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ, బాషాను సింధూర వృక్షాలన్నిటికీ, 14ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ, 15ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ, 16తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు. 17అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది. మనుషుల గర్వం తగ్గిపోతుంది. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 18విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి. 19యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు. 20ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు. ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు. 21యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ, ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో, కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 2:4–19

4దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, 5భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. 6కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి. 7దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. 8దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. 9దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. 10ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది. 11మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. 12ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. 13రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. 14మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. 15దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. 16దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. 18దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. 19దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 3:1–18

1కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు. 2అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి. 3అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో. 4అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు. 5నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో. 6ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. 7నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు. 8అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి. 9యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు. 10అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది. 11కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు. 12ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు. 13జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు. 14వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం. 15రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది. 16జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 17అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి. 18దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 5 మార్చి పౌర కాలెండర్‌లో 18 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు