హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 16 ఫిబ్రవరి
ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 3 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 16 ఫిబ్రవరి, 2027
మంగళవారం · పెంతెకొస్తు తర్వాత 38వ వారం · స్వరం 4
పండుగలు మరియు పరిశుద్ధులు
Afterfeast of the Meeting of the Lord
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక (సోమవారం కోసం)
21దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు. 22ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. 23ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. 24మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు. 3:1భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు. 3జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు. 7అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. 8చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. 9కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
పత్రిక
10జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది. 13మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. 16మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది. 18క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. 19ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 20ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు. 21దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. 22ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.
పత్రిక (పరిశుద్ధ సుమెయోను, పరిశుద్ధ అన్నా కోసం)
11అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. 12మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. 13ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే 14ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!
సువార్త (సోమవారం కోసం)
13యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. 14వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? 15మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. 16వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. 17అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.
సువార్త
18అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. 19“బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు. 20ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. 21రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది. 22ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. 23చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు. 24యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. 25చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. 27తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.
సువార్త (పరిశుద్ధ సుమెయోను, పరిశుద్ధ అన్నా కోసం)
25యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. 26అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. 27ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. 28సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, 29“ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా! 30అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.” 33యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. 34అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు. 35అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.” 36దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, 37ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. 38ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 3 ఫిబ్రవరి పౌర కాలెండర్లో 16 ఫిబ్రవరి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు