Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 18 జనవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 5 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 18 జనవరి, 2027

సోమవారం · పెంతెకొస్తు తర్వాత 34వ వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

దైవ ప్రత్యక్షత ముందు రోజు

ఒక రోజు ఉపవాసం · కఠిన ఉపవాసం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

మొదటి ఘడియ: ప్రవచనం

యెష 35:1–10

1అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది. 2అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి. 3బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి. 4బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.” 5గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి. 6కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి. 7ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి. 8పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు. 9అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. 10నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.

మొదటి ఘడియ: పత్రిక

అపొ.కా 13:25–32

25యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు. 26“సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది. 27యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు. 28ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు. 29ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. 30అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. 31ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు. 32పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”

మొదటి ఘడియ: సువార్త

మత్తయి 3:1–11

1ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు. 3పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే. 4ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. 5యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి, 6తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు. 7చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. 9‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను. 10ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు. 11పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.

మూడవ ఘడియ: ప్రవచనం

యెష 1:16–20

16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.” 17మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి. 18యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. 19మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. 20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది.

మూడవ ఘడియ: పత్రిక

అపొ.కా 19:1–8

1అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు. 2వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు. 3అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు. 4అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు. 5వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు. 6తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు. 7వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు. 8తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.

మూడవ ఘడియ: సువార్త

మార్కు 1:1–8

1దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం. 2యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. 3‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.” 4యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. 5యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. 6యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. 7యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. 8“నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.

ఆరవ ఘడియ: ప్రవచనం

యెష 12:3–6

3ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు, 4“యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి. 5యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి. 6గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”

ఆరవ ఘడియ: పత్రిక

రోమా 6:3–11

3క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా? 4తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. 8మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. 10ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. 11ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

ఆరవ ఘడియ: సువార్త

మార్కు 1:9–15

9యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. 10యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. 11అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.” 12వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. 14యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, 15“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.

9వ ఘడియ: ప్రవచనం

యెష 49:8–15

8యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. 9నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది. 10వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు. 11నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.” 12చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు. 13బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. 14అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది. 15స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

9వ ఘడియ: పత్రిక

తీతు 2:11–14; 3:4–7

11చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది. 14ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. 3:4అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

9వ ఘడియ: సువార్త

మత్తయి 3:13–17

13ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 14అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. 15కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు. 16యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు. 17“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 1:1–13

1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. 3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. 6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. 9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. 11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 14:15–18, 21–23, 27–29

15యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు. 16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. 17చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. 18నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” 21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. 22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. 23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. 27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. 28నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. 29అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి.

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 15:22–16:1

22మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు. 23మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది. 24ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు. 25మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు, 26“మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.” 27తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు. 16:1తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెహో 3:7–8, 15–17

7అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను. 8మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.” 15అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే 16పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. 17ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.

సాయంకాల ప్రార్థన: పఠనం

2 రాజులు 2:6–14

6అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు. 7తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. 8అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు. 9వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. “నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.” అందుకు ఎలీషా “నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి” అన్నాడు. 10అందుకు ఏలీయా “నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు” అన్నాడు. 11వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 12ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు. ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు. 13ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. 14నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

2 రాజులు 5:9–14

9కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు. 10ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు. 11నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. 12ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. 13అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు. 14అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెష 1:16–20

16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.” 17మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి. 18యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. 19మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. 20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 32:1–10

1యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. 2యాకోబు వారిని చూసి “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. 3యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి, 4“మీరు నా ప్రభువైన ఏశావుతో, ‘ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను. 5నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు’ అని చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు. 6ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగివచ్చి “మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు” అని చెప్పారు. 7అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై, 8“ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు” అనుకుని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు. 9అప్పుడు యాకోబు “నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, ‘నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, 10నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను.

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 2:5–10

5ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. 7అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. 8ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. 9ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది. 10ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు మోషే” అని చెప్పింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

న్యాయా 6:36–40

36అప్పుడు గిద్యోను దేవునితో “నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే, 37నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను” అన్నాడు. 38అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు. 39అప్పుడు గిద్యోను “నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు” అని దేవునితో అన్నప్పుడు 40ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 రాజులు 18:30–39

30అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు. 31“నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు. 32ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. 33కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు. 34తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు. 35అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు. 36సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. 37యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు. 38అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. 39ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు.

సాయంకాల ప్రార్థన: పఠనం

2 రాజులు 2:19–22

19తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో “మా గోడు వినండి. మా యజమానులైన మీరు చూస్తున్నట్లు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది. కానీ ఇక్కడి నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది” అన్నారు. 20దానికి ఎలీషా “ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు. 21అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.” 22అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్ళు ఈ రోజు వరకూ ఆరోగ్యకరంగా ఉన్నాయి.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెష 49:8–15

8యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. 9నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది. 10వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు. 11నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.” 12చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు. 13బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. 14అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది. 15స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

పత్రిక (దైవ ప్రత్యక్షత ముందు రోజు కోసం)

1 కొరింతీ 9:19–27

19నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 20యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. 21దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ. 24పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. 25అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము. 26కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.

సువార్త (దైవ ప్రత్యక్షత ముందు రోజు కోసం)

లూకా 3:1–18

1సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి. 2అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. 3అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు. 4యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి. 5ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి. 6ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.” 7అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను. 9ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు. 10అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు. 12పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 13అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు. 14“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు. 15క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు. 16వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. 17తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.” 18అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.

జలాల మహా ఆశీర్వాదం

యెష 35:1–10

1అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది. 2అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి. 3బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి. 4బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.” 5గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి. 6కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి. 7ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి. 8పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు. 9అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. 10నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.

జలాల మహా ఆశీర్వాదం

యెష 55:1–13

1“దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి. రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి. 2తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి. 3శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. 4ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.” 5నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు. 6యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. 7భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి. వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు. 8“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు. 9“ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి. 10వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు. 11ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది. 12మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు. మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. 13ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”

జలాల మహా ఆశీర్వాదం

యెష 12:3–6

3ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు, 4“యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి. 5యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి. 6గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”

జలాల మహా ఆశీర్వాదం (పత్రిక)

1 కొరింతీ 10:1–4

1సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు. 2అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు. 3వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు. 4ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.

జలాల మహా ఆశీర్వాదం (సువార్త)

మార్కు 1:9–11

9యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. 10యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. 11అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 5 జనవరి పౌర కాలెండర్‌లో 18 జనవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు