హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 17 జనవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 17 జనవరి, 2027
ఆదివారం · సామాన్య కాలం రెండవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం రెండవ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
3దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. 4అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు “అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను” అన్నాడు. 5ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి “నన్ను పిలిచావు గదా, వచ్చాను” అన్నాడు. ఏలీ “నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు. 6యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి “అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను” అన్నాడు. అందుకు అతడు “బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అని చెప్పాడు. 7అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. 8యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి “అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను” అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు. 9అతడు “నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, ‘యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి’ అని చెప్పు” అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు. 10తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా “సమూయేలూ సమూయేలూ” అని పిలిచినప్పుడు సమూయేలు “నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి” అన్నాడు. 19సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని మాటల్లో ఏదీ తప్పిపోలేదు.
ప్రతిస్పందన కీర్తన
2భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు. 3తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు. 6నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు. 7అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను. 8నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. 9నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు.
రెండవ పఠనం
13ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. 14దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు. 15మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 17అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. 19మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.
సువార్త
35మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు. 37అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు. 39ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు. 40యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. 41ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. 42యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
ఈరోజు పరిశుద్ధులు
- ఐగుప్తు పునీత అంతోని, మఠాధిపతి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు