హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 14 జనవరి
ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 1 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 14 జనవరి, 2027
గురువారం · పెంతెకొస్తు తర్వాత 33వ వారం · స్వరం 7
పండుగలు మరియు పరిశుద్ధులు
Circumcision of our Lord
క్రిస్మస్ కాలం (Svyatki)
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
1అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు. 2అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను” అని చెప్పాడు. 4నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు. 5ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది. 6నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు. 7నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది. 8నీకూ నీ తరువాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.” 9దేవుడు మళ్ళీ అబ్రాహాముతో ఇలా చెప్పాడు. “నీ వరకూ నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే గాక, నీ తరువాత నీ సంతానం తమ తరతరాల్లో నా నిబంధన పాటించాలి. 10నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి. 11అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది. 12నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది. 14సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.”
సాయంకాల ప్రార్థన: పఠనం
22గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు. 23అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు. 24ప్రవాహించే నదులు లేనప్పుడు, నీటి ఊటలు ఇంకా పుట్టనప్పుడు నేను రూపుదిద్దుకున్నాను. 25పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. 26ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను. 27ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 28ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను. 29భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను. 30నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను.
సాయంకాల ప్రార్థన: పఠనం
31ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు. 32ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. 2గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. 3నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. 4దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. 5యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. 6నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. 7దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. 8ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. 9మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. 10నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. 11నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. 12తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.
ఉదయ ప్రార్థన: సువార్త
9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. 11నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. 12జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. 13జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. 14నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
పత్రిక (ప్రభువు సున్నతి కోసం)
8క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి. 9ఎందుకంటే దైవత్వపు సర్వ సంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తూ ఉంది. 10ప్రతి ప్రభుత్వానికీ ఆధిపత్యానికీ పై శిరస్సుగా ఉన్న ఆయనలో మీరు సంపూర్ణులు. 11మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి. 12బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.
పత్రిక (పరిశుద్ధ బాసిల్ కోసం)
26ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. 8:1ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. 2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.
సువార్త (ప్రభువు సున్నతి కోసం)
20ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు. 21ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. 40పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది. 41పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు. 42ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు. 43ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు. 44ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు. 45ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. 46అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు. 47ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు. 48ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది. 49అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు. 50కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు. 51అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది. 52యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.
సువార్త (పరిశుద్ధ బాసిల్ కోసం)
17ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. 19రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు. 20అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. 21“ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది. “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. 22“మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. 23ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 1 జనవరి పౌర కాలెండర్లో 14 జనవరి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు