Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 3 జనవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · డిసెంబర్ 21 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 3 జనవరి, 2027

ఆదివారం · స్వరం 6

పండుగలు మరియు పరిశుద్ధులు

పెంతెకొస్తు తర్వాత 31వ ఆదివారం

జనన పండుగకు ముందు ఆదివారం

క్రీస్తు జనన ఉపవాసం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 14:14–20

14తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు. 15రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు. 16అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు. 17అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు. 18అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. 19అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక. 20నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ద్వితీ 1:8–11, 15–17

8ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.” 9ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను. 10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు. 11మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. 15కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను. 16అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. 17అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.

సాయంకాల ప్రార్థన: పఠనం

ద్వితీ 10:14–21

14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. 16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. 19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. 20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

ఉదయ ప్రార్థన 9వ సువార్త

యోహా 20:19–31

19ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 20ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. 21అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు. 24పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. 26ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. 27తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. 28దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. 29అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. 30యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. 31కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.

పత్రిక (క్రీస్తు జననానికి ముందు ఆదివారం కోసం)

హెబ్రీ 11:9–10, 17–23, 32–40

9విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు. 10ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. 17విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు. 20విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు. 21విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. 22విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు. 23విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు. 32ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు. 33విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు. 35స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు. 36ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు. 37వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు. 38అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.

సువార్త (క్రీస్తు జననానికి ముందు ఆదివారం కోసం)

మత్తయి 1:1–25

1అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి. 2అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు. 3యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము. 4ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను. 5శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి. 6యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను. 7సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. 8ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా. 9ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. 10హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా. 11యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు. 12బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు. 13జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు. 14అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు. 15ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు. 16యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు. 17ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు. 18యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. 19ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. 20అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు. 22“‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. 25అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 21 డిసెంబర్ పౌర కాలెండర్‌లో 3 జనవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు