హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 19 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 19 డిసెంబర్, 2026
శనివారం · ఆగమన కాలం మూడవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
డిసెంబర్ 19
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
2ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. 3యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు “చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు 4ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. 5నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.” 6అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు. 7ఆయన నాతో, ‘చూడు నువ్వు గర్భవతివి అవుతావు. కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గానీ, మద్యాన్ని గానీ తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకూ దేవుని కోసం నాజీర్ గా ఉంటాడు’ అని చెప్పాడు” అంది. 24తరువాత ఆ స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. 25ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.
ప్రతిస్పందన కీర్తన
3నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు. 4నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు. 5నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే. 6నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను. 16ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను. 17దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.
సువార్త
5యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు. 6వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు. 7అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. 8జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా 9యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది. 10ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు. 11ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు. 12జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. 13అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. 14అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు. 15అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. 16ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. 17తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు. 18దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు 19దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు. 20నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు. 21ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు. 22అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు. 23అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు. 24ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు. 25ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు