హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 20 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 20 డిసెంబర్, 2026
ఆదివారం · ఆగమన కాలం నాల్గవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
ఆగమన కాలం నాల్గవ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి, 2“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు. 3అప్పుడు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి” అన్నాడు. 4అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది, 5“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా? 8కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను. 9నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను. 10నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి, 11నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను. యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను వారు శాశ్వతంగా పాలన చేస్తారు. 12నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. 14అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను. 15అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను. 16నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”
ప్రతిస్పందన కీర్తన
1ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం. యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను. 2నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు. 3నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను. 4శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా. 26నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు. 28నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
రెండవ పఠనం
25యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది. 26నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి. 27ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.
సువార్త
26ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో 27దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ. 28ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు. 29ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా, 30దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. 31ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. 32ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. 33ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. 34మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. 35ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. 36పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. 37దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు. 38అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు