హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 29 నవంబర్
ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 16 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 29 నవంబర్, 2026
ఆదివారం · స్వరం 1
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు తర్వాత 26వ ఆదివారం
క్రీస్తు జనన ఉపవాసం
చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
1యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. 2తండ్రి అయిన దేవుని భవిష్యద్ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక. 3మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది. 4దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. 7నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. 9మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు. 10మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. 13కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి. 14విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. 15మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. 16ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది. 17ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. 18మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. 19అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. 22సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. 24“ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది 25గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది. 2:1ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు. 4మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి. 5ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు. 6ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”
సాయంకాల ప్రార్థన: పఠనం
21దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు. 22ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. 23ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. 24మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు. 3:1భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు. 3జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు. 7అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. 8చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. 9కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు. 5బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి. 6అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది. 7అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి. 8అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్.
ఉదయ ప్రార్థన నాల్గవ సువార్త
1ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. 2సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. 3కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు. 4అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. 5వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? 6ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు 7మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు. 8అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. 9వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు. 10ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ. 11అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు. 12అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
పత్రిక (పరిశుద్ధ మత్తయి కోసం)
9దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం. 10క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం. 11ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం. 12మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు. 14నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు. 15ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
పత్రిక
8గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. 9ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. 10కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, 11పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం. 13ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా? 14బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. 15బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
సువార్త (పరిశుద్ధ మత్తయి కోసం)
9యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. 10యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. 11పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు. 12యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. 13నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.
సువార్త
25ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 26అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు. 27అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు. 28దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు. 29అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు. 30అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు. 31అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు. 32ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు. 33అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు. 35మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. 36అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. 37దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 16 నవంబర్ పౌర కాలెండర్లో 29 నవంబర్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు