Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2026 › 31 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 18 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 31 అక్టోబర్, 2026

శనివారం · పెంతెకొస్తు తర్వాత 22వ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Apostle and Evangelist Luke (1st C)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 1:1–7

1ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. 2ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. 3మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. 4మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం. 5దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యాకో 1:1–12

1దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. 2నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. 5మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. 9దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. 11సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. 12పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

యూదా 1:1–7, 17–25

1తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. 2దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. 3ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది. 4ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. 5ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. 6తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. 7అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. 17కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. 18చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు. 20కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి. 24మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

ఉదయ ప్రార్థన: సువార్త

యోహా 21:15–25

15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.

పత్రిక

2 కొరింతీ 5:1–10

1భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం. 3ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. 4ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ. 5దీని కోసం మనలను సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు. 6అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం. 9అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం. 10మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.

పత్రిక (పరిశుద్ధ లూకా కోసం)

కొలస్స 4:5–9, 14, 18

5సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు. 7ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు. 8ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను. 9ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు. 14ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు. 18పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.

సువార్త

లూకా 6:1–10

1ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు. 2అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, “విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు” అని వారినడిగారు. 3యేసు వారితో ఇలా అన్నాడు, “దావీదుకీ, అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేశాడో అది కూడా మీరు చదవలేదా? 4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని, తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా!” అన్నాడు. 5ఇంకా ప్రభువు, “అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని” అని వారితో చెప్పాడు. 6మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. 7ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు. 8వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, “నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు. 9అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను” అని వారితో చెప్పి 10చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి, “నీ చెయ్యి చాపు” అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.

సువార్త (పరిశుద్ధ లూకా కోసం)

లూకా 10:16–21

16మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.” 17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు. 21ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 18 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 31 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు