1సొలొమోను యెహోవా మందిరం, రాజగృహాల నిర్మాణం, తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరవాత,
2యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు.
3యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.
4నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలనూ, విధులనూ పాటిస్తే,
5‘నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు’ అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.
6అయితే మీరు గాని, మీ సంతానం గాని నానుండి తొలగిపోయి, నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే,
7నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.
8ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
9అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, ‘వారు ఐగుప్తు దేశం నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారి పైకి రప్పించాడు.’”