20అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది.
21“నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది.
22అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు.
23ఆయన, “నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి” అని చెప్పాడు.
24మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు.
25కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు.
26కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి.
27మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.
28అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.