హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 26 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 26 డిసెంబర్, 2027
ఆదివారం · క్రిస్మస్ కాలం
పండుగలు మరియు పరిశుద్ధులు
పవిత్ర కుటుంబం: యేసు, మరియ, యోసేపు
పండుగ · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
20హన్నా గర్భం ధరించి, రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని “నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను” అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది. 21ఎల్కానా, అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి ఏడూ అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు. 22అయితే హన్నా “బిడ్డ పాలు మానే వరకూ నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను” అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు. 24పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది. 25వారు ఒక కోడెను వధించి, పిల్లవాణ్ణి ఏలీ దగ్గరకి తీసుకు వచ్చారు. అప్పుడామె అతనితో ఇలా చెప్పింది, 26“ప్రభూ, నా ప్రభువు జీవం తోడు నీ దగ్గర నిలబడి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. 27యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు. 28కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు” అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు.
ప్రతిస్పందన కీర్తన
1ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. కోరహు వారసుల కీర్తన. సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం! 2యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది. 4నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సెలా 5ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు. 8యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. సెలా. 9దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.
రెండవ పఠనం
1మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు. 2ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు. 21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.
సువార్త
41పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు. 42ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు. 43ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు. 44ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు. 45ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. 46అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు. 47ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు. 48ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది. 49అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు. 50కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు. 51అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది. 52యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత స్తెఫను, మొదటి హతసాక్షి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం C, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు