Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 17 ఆగస్టు

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 17 ఆగస్టు, 2027

మంగళవారం · సామాన్య కాలం 20వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 20వ వారపు మంగళవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

న్యాయా 6:11–24

11అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, 12యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, 13గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు. 14అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. 15అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు. 16అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు. 17అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు, 18నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు. 19అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. 20దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు. 21అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. 22గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు. 23అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు. 24అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 85:8, 10–13

8యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు. 10నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. 11భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది. 12యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది. 13నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.

సువార్త

మత్తయి 19:23–30

23యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” 25శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. 26యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు. 27అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా 28యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు. 29నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. 30మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు