Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 9 ఆగస్టు

ఆర్థడాక్స్ కాలెండర్ · జూలై 27 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 9 ఆగస్టు, 2027

సోమవారం · పెంతెకొస్తు తర్వాత ఎనిమిదవ వారం · స్వరం 6

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Great Martyr and Healer Panteleimon († 305)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 కొరింతీ 9:13–18

13దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా? 14అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు. 15అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు. 16నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన. 17దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. 18అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.

పత్రిక (పరిశుద్ధ పాంటెలెయిమోన్ కోసం)

2 తిమో 2:1–10

1నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. 2అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు. 3క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. 4సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. 5ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. 6కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. 7నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. 8నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 9ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు. 10అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.

సువార్త

మత్తయి 16:1–6

1అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు. 2ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ, 3అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు. 4సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. 5అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. 6అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు.

సువార్త (పరిశుద్ధ పాంటెలెయిమోన్ కోసం)

యోహా 15:17–16:2

17మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. 18“ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. 20“‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. 22నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు. 23“నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది. 26“తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు. 16:1“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను. 2వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 27 జులై పౌర కాలెండర్‌లో 9 ఆగస్టు. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు