హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 9 ఆగస్టు
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 9 ఆగస్టు, 2027
సోమవారం · సామాన్య కాలం 19వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 19వ వారపు సోమవారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
సిలువ పునీత తెరెసా బెనెడిక్టా (ఎడిత్ స్టైన్), కన్య, హతసాక్షి · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
12కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు. 13మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు? 14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. 16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. 19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. 20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే. 22మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.
ప్రతిస్పందన కీర్తన
12యెరూషలేమా, యెహోవాను ఘనపరచు. సీయోనూ, నీ దేవుణ్ణి కీర్తించు. 13ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు. 14నీ పొలిమేరల్లో శాంతి సమాధానాలు నిలిచి ఉండేలా చేసేది ఆయనే. నీకు ఆహారంగా మంచి గోదుమ పంటను ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. 15భూమికి ఆజ్ఞ జారీ చేసేవాడు ఆయనే. ఆయన వాక్కు భూమిపై చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. 19తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. 20మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.
సువార్త
22వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు, “మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు, 23వారు ఆయనను చంపుతారు. కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు” అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు. 24వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు. 25అతడు, “అవును, చెల్లిస్తాడు” అన్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, “సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?” అని అడిగాడు. 26అతడు, “బయటివాళ్ళ దగ్గరే” అని చెప్పాడు. యేసు, “అలాగైతే కొడుకులు స్వతంత్రులే. 27అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.
ఈరోజు పరిశుద్ధులు
- సిలువ పునీత తెరెసా బెనెడిక్టా (ఎడిత్ స్టైన్), కన్య, హతసాక్షి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు