హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 1 ఆగస్టు
ఆర్థడాక్స్ కాలెండర్ · జూలై 19 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 1 ఆగస్టు, 2027
ఆదివారం · స్వరం 5
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు తర్వాత ఆరవ ఆదివారం
మొదటి ఆరు విశ్వ సంఘ మహాసభల పితరులు
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం (పితరుల కోసం)
14తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు. 15రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు. 16అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు. 17అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు. 18అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. 19అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక. 20నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (పితరుల కోసం)
8ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.” 9ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను. 10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు. 11మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. 15కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను. 16అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. 17అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.
సాయంకాల ప్రార్థన: పఠనం (పితరుల కోసం)
14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. 16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. 19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. 20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
సాయంకాల ప్రార్థన: పఠనం
ఈ అనువాదంలో లేదు
సాయంకాల ప్రార్థన: పఠనం
ఈ అనువాదంలో లేదు
సాయంకాల ప్రార్థన: పఠనం
ఈ అనువాదంలో లేదు
ఉదయ ప్రార్థన ఆరవ సువార్త
36వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. 41అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. 44తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. 46“క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. 49“వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. 50ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 52వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
పత్రిక
6దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి. 9మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి. 14మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు.
పత్రిక (పితరుల కోసం)
7మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి. 8యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. 9అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారనియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటివల్ల ఏ ప్రయోజనం కలగదు. 10మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు. 11ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు. 12కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు. 13కాబట్టి మనం ఆయన అపనిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం. 14ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. 15యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
పత్రిక (పరిశుద్ధ సెరాఫిమ్ కోసం)
22అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. 25మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం. 6:1సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
సువార్త
1యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు. 2కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు. 3ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు. 4యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు? 5‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? 6అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. 7అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 8ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
సువార్త (పితరుల కోసం)
1యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. 2నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. 3ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. 4నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను. 5తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు. 6లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు. 7నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు. 8ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు. 9“నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. 10నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది. 11నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు. 12నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను. 13ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
సువార్త (పరిశుద్ధ సెరాఫిమ్ కోసం)
17ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. 19రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు. 20అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. 21“ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది. “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. 22“మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. 23ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 19 జులై పౌర కాలెండర్లో 1 ఆగస్టు. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు