హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 20 జులై
ఆర్థడాక్స్ కాలెండర్ · జూలై 7 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 20 జులై, 2027
మంగళవారం · పెంతెకొస్తు తర్వాత ఐదవ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
Venerable Thomas of Mt Maleon (10th C)
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
9చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది? 10అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. 11“నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది. 12కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది. 13కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం. 14సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది. 15నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు. 16మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. 17దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. 18ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.
పత్రిక (బుధవారం కోసం)
7కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. 8నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. 9దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది. 10ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, 11“యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.” 12యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.” 13మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక. 14సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను. 15అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. 16ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను.
సువార్త
14పరిసయ్యులు బయటికి పోయి, ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. 15యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. 22అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. 23అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు. 24పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. 25ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు. 26ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. 28దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే. 29ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. 30నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
సువార్త (బుధవారం కోసం)
38అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, 39“వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు. 40యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. 41నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 42తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 43“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. 44దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. 45అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 7 జులై పౌర కాలెండర్లో 20 జులై. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు