Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 13 జులై

ఆర్థడాక్స్ కాలెండర్ · జూన్ 30 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 13 జులై, 2027

మంగళవారం · పెంతెకొస్తు తర్వాత నాల్గవ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Synaxis of the Twelve Glorious and All-Praised Apostles: Peter and Andrew, James and John, Phillip, Bartholomew, Thomas, Matthew, James the son of Alpheus, Jude [Thaddeus], Simon Zealotes, and Matthias

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక (సోమవారం కోసం)

రోమా 9:18–33

18కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. 19అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. 20అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? 21ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? 22ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? 23తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, 24అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? 25దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. 26మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.” 27“ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. 29యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.” 30అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. 31అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. 32ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. 33“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

పత్రిక

రోమా 10:11–11:2

11“ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది. 16అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా? 17కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది. 18అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.” 19నేనింకా చెప్పేదేమంటే, “ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదా? మోషే ముందుగా మాట్లాడుతూ, “అసలు జాతి అని పిలవడానికి వీలు లేని వారి వలన మీలో రోషం పుట్టిస్తాను. తెలివి లేని ప్రజల వలన మీకు కోపం కలిగేలా చేస్తాను” అని అన్నాడు. 20తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు, “నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు. నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను.” 21ఇశ్రాయేలు విషయమైతే అతడు, “అవిధేయులై ఎదురు తిరిగి మాట్లాడుతున్న ప్రజలవైపు నేను రోజంతా నా చేతులు చాస్తూనే ఉన్నాను” అని చెబుతున్నాడు. 11:1అలాగైతే నేనడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచి పెట్టేశాడా? కానే కాదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను. 2తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచి పెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది మీకు తెలియదా? అదేవిధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో విన్నవించుకొన్నాడో తెలియదా?

పత్రిక (అపొస్తలుల కోసం)

1 కొరింతీ 4:9–16

9దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం. 10క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం. 11ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం. 12మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు. 14నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు. 15ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

సువార్త (సోమవారం కోసం)

మత్తయి 11:2–15

2క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. 4యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. 6నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. 7వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? 8అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు. 9మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను. 10‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే. 11స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు. 12బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు. 13ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు. 14ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే. 15వినే చెవులున్నవాడు విను గాక.

సువార్త

మత్తయి 11:16–20

16ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు. 18ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు. 19మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.” 20అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.

సువార్త (అపొస్తలుల కోసం)

మార్కు 3:13–19

13తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. 14తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. 15రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు. 16వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు), 17జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం), 18అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, 19యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 30 జూన్ పౌర కాలెండర్‌లో 13 జులై. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు