Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 14 జులై

ఆర్థడాక్స్ కాలెండర్ · జూలై 1 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 14 జులై, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత నాల్గవ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Unmercenaries Cosmas and Damian, Martyrs at Rome († 284)

ఉపవాస దినం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

రోమా 11:2–12

2తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచి పెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది మీకు తెలియదా? అదేవిధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో విన్నవించుకొన్నాడో తెలియదా? 3“ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడదోశారు. నేనొక్కడినే మిగిలాను. వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.” 4అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.” 5అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది. 6అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు. 7అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. 8దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది. 9దీనికి దావీదు ఏమన్నాడంటే, “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక. 10వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక. వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.” 11కాబట్టి నేనడిగేది ఏమిటంటే, వారు పడిపోవడం కోసమే తొట్రుపడ్డారా? అలా కానేకాదు. వారి తొట్రుపాటు వలన యూదేతరులకు పాపవిమోచన కలిగి, అది యూదులు రోషం తెచ్చుకోడానికి కారణమైంది. 12వారి అపరాధం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుందో!

పత్రిక (పరిశుద్ధ కోస్మాస్, పరిశుద్ధ దమియాన్ కోసం)

1 కొరింతీ 12:27–13:8

27మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను. 13:1నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. 4ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు. 5అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు. 6ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. 7అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. 8ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

సువార్త

మత్తయి 11:20–26

20అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు. 21“అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే. 22తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను. 23కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! 24తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.” 25ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.

సువార్త (పరిశుద్ధ కోస్మాస్, పరిశుద్ధ దమియాన్ కోసం)

మత్తయి 10:1, 5–8

1ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు. 5యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. 6ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 1 జులై పౌర కాలెండర్‌లో 14 జులై. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు