హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 10 జులై
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 10 జులై, 2027
శనివారం · సామాన్య కాలం 14వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 14వ వారపు శనివారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
శనివారం ధన్య కన్య మరియ స్మరణ దినం · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
29తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను. 30హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు. 31అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను. 32ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు. 50:15యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి “ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో” అనుకున్నారు. 16కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు. 17“మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, ‘నీ సోదరులు నీకు కీడు చేశారు. వారిని, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు’ అని చెప్పమన్నాడు” అని అతనితో చెప్పారు. 18అతని సోదరులు పోయి అతని ముందు సాగిలపడి “ఇదిగో మేము నీకు దాసులం” అన్నారు. 19యోసేపు “భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? 20మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. 21కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను” అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు. 22యోసేపు, అతని తండ్రి కుటుంబం వారూ ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 ఏళ్ళు బతికాడు. 23యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరం పిల్లలను చూశాడు. మనష్షే కొడుకయిన మాకీరు పిల్లలను కూడా చూశాడు. వారిని యోసేపు ఒడిలో ఉంచారు. 24యోసేపు తన సోదరులను చూసి “నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు” అని చెప్పాడు 25అంతే గాక యోసేపు “దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకుపోవాలి” అని చెప్పి ఇశ్రాయేలు కొడుకులతో ప్రమాణం చేయించుకున్నాడు. 26యోసేపు 110 ఏళ్ల వయసువాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. 2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 3ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. 4యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. 6ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 7ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.
సువార్త
24గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. 25శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా! 26కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. 27మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి. 28“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. 29రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు. 32మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను. 33ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు