Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 2 జులై

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 2 జులై, 2027

శుక్రవారం · సామాన్య కాలం 13వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 13వ వారపు శుక్రవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఉపవాసం మరియు పశ్చాత్తాపం

పశ్చాత్తాప దినం

ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 23:1–4, 19; 24:1–8, 62–67

1శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది. 2కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు. 3తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు, 4“నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి” అన్నాడు. 19ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు. 24:1అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్దుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు. 2అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలనూ ఇంటి విషయాలనూ నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు. “నీ చెయ్యి నా తొడ కింద ఉంచు. 3నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా 4నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో ‘భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు’ అని ప్రమాణం చేయిస్తాను” అని అతనితో అన్నాడు. 5దానికి ఆ దాసుడు “ఒకవేళ ఆమె నాతో కలసి ఈ దేశం రావడానికి ఇష్టపడక పొతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా?” అని ప్రశ్నించాడు. 6అప్పుడు అబ్రాహాము “ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు. 7నా తండ్రి ఇంటి నుండీ, నా బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు. 8అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు” అని చెప్పాడు. 62ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్‌ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు. 63ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. 64రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది. 65“మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?” అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు “ఆయన నా యజమాని” అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. 66అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. 67అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 106:1–5

1యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది. 2యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు? 3న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు. 4యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ, 5నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.

సువార్త

మత్తయి 9:9–13

9యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. 10యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. 11పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు. 12యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. 13నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు