హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 26 జూన్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 26 జూన్, 2027
శనివారం · సామాన్య కాలం 12వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 12వ వారపు శనివారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
శనివారం ధన్య కన్య మరియ స్మరణ దినం · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు. 3“ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి. 4నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. 5మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు. 6అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. 7తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. 8తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు. 9వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు. 10అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది. 11అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. 12శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది. 13అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? 14యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. 15అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
ప్రతిస్పందన కీర్తన
47ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. 48నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. 50ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. 53ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు. 54అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”
సువార్త
5యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, 6“ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. 7“నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. 9నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు. 10యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. 11తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. 12అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” 13యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు. 14తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు. 15యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది. 16సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. 17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. మన రోగాలను భరించాడు.”
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు