Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 24 జూన్

ఆర్థడాక్స్ కాలెండర్ · జూన్ 11 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 24 జూన్, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత మొదటి వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Apostles Bartholomew and Barnabas (1st C)

ఉపవాసం లేని వారం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

1 పేతు 1:3–9

3మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది. 4దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. 7నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. 9మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 పేతు 1:13–19

13కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి. 14విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. 15మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. 16ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది. 17ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. 18మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. 19అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 పేతు 2:11–24

11ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి. 13ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. 14రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి. 15ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం. 16స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి. 17అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి. 18సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి. 19ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. 20మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. 21దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు. 22ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. 23ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. 24మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

ఉదయ ప్రార్థన: సువార్త

యోహా 21:15–25

15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.

పత్రిక

రోమా 1:28–2:9

28వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు. 30వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు. 2:1కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా? 2ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా? 5నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి.

పత్రిక (అపొస్తలుల కోసం)

అపొ.కా 11:19–26, 29–30

19స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. 20వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. 21ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. 22వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు. 24అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు. 25బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు. 26వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు. 29అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. 30వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

సువార్త

మత్తయి 5:27–32

27“‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 31“‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. 32నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

సువార్త (అపొస్తలుల కోసం)

లూకా 10:16–21

16మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.” 17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు. 21ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 11 జూన్ పౌర కాలెండర్‌లో 24 జూన్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు