Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 11 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 29 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 11 ఏప్రిల్, 2027

ఆదివారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

మహా ఉపవాస కాలం నాల్గవ ఆదివారం

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన మొదటి సువార్త

మత్తయి 28:16–20

16పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు. 18అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

పత్రిక

హెబ్రీ 6:13–20

13దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14“నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు. 16సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు. 18అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. 19ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. 20మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.

పత్రిక (పరిశుద్ధ యోహాను కోసం)

ఎఫెసీ 5:8–19

8గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. 9ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. 10కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, 11పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం. 13ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా? 14బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. 15బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.

సువార్త

మార్కు 9:17–31

17ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. 18ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు. 19అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు. 20వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. 21యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. 22ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. 23యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. 24వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు. 25యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. 26ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. 27కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. 28యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు. 29ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు. 30వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు. 31ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.

సువార్త (పరిశుద్ధ యోహాను కోసం)

మత్తయి 4:25–5:12

25గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు. 5:1యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. 3“ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే. 4దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. 5సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. 6నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. 7కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. 8పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. 9శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. 10నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11“నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 29 మార్చి పౌర కాలెండర్‌లో 11 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు