హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 10 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 28 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 10 ఏప్రిల్, 2027
శనివారం · మహా ఉపవాస కాలం నాల్గవ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
స్మరణ శనివారం
మహా ఉపవాస కాలం
ఉపవాసం: నూనెతో
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక (దివంగతుల కోసం)
47మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. 48మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. 49మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. 50సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. 51ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. 55“మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” 56మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. 57అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
పత్రిక
9ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు. 11మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
సువార్త (దివంగతుల కోసం)
24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు. 26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. 28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు. 30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
సువార్త
31యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. 32అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 33యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. 34అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం. 35వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 36ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. 37ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 28 మార్చి పౌర కాలెండర్లో 10 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు