హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 6 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 24 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 6 ఏప్రిల్, 2027
మంగళవారం · మహా ఉపవాస కాలం నాల్గవ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
Forefeast of the Annunciation
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
1యెహోవా, నీవే నా దేవుడివి. నేను నిన్ను ఘన పరుస్తాను. నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు. సత్య స్వభావాన్ననుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చావు. 2నీవు శత్రువుల నగరాన్ని దిబ్బగా చేశావు. ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలంగా చేశావు. అన్యుల కోటను పట్టణంగా మళ్ళీ ఉండకుండా చేశావు. అది మళ్ళీ ఎప్పుడూ నిర్మాణం కాకుండా చేశావు. 3కాబట్టి బలిష్ఠులైన ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. క్రూర జనం నివసించే పట్టణవాసులు నీకు భయపడతారు. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు పేదలకు శరణుగా ఉన్నావు. 4ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు. 5ఎండ వేడిమి వర్షాభావం ఉన్న ప్రదేశాన్ని అణచి వేసినట్టు నీవు అన్యుల ఘోషను అణచివేశావు. మేఘం నీడలో ఎండ చల్లారి పోయినట్టు బలాత్కారుల జయకీర్తన అణిగి పోతుంది. 6ఈ పర్వతంపై సేనల ప్రభువు యెహోవా ప్రజలందరి కోసం కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేస్తాడు. మూలుగు ఉన్న కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేస్తాడు. 7జాతులందరి ముఖాలను కప్పుతున్న ముసుకును సమస్త జాతుల మీద పరిచిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు. 8మరెన్నడు ఉండకుండా మరణాన్ని ఆయన మింగి వేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివాడి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేస్తాడు. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు. 9ఆ దినాన ప్రజలు ఇలా అంటారు. ఇదిగో మనలను రక్షిస్తాడని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం ఎదురు చూసిన యెహోవా ఈయనే. ఆయన ఇచ్చే రక్షణ విషయం సంతోషించి ఉత్సాహ పడదాము.
సాయంకాల ప్రార్థన: పఠనం
8దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, 9“వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను, 10మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను. 11నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు. 12దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, 13మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. 14భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు. 16ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు. 17దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
8ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపట వర్తనుడు తిరస్కారానికి గురౌతాడు. 9తినడానికి లేకపోయినా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడి కంటే ఎదో ఒక చిన్న పని-సేవకుడుగా అయినా సరే-చేసుకుంటూ ఉండడం మంచిది. 10ఉత్తముడు తమ పశువుల ప్రాణాల పట్ల దయ చూపుతాడు. దుష్టులు చూపించే ప్రేమ క్రూరత్వమే. 11తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు. 12దుర్మార్గులు చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్ము కోసం ఆశపడతారు. నీతిమంతుల ఉనికి వర్ధిల్లుతుంది. 13వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు. 14మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది. 15మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు. 16మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు. 17సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు. 18కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి. 19నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం. 20కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది. 21నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి. 22అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (శుభవార్త పండుగ కోసం)
10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ 11ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు. 12అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 14నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. 16యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. 17అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
సాయంకాల ప్రార్థన: పఠనం (శుభవార్త పండుగ కోసం)
27ఆ రోజులు అయిన తరవాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు, సమాధానబలులు అర్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 44:1ఆ మనిషి నన్ను తూర్పువైపు తిరిగి ఉన్న పరిశుద్ధ స్థలం బయటి ప్రవేశద్వారానికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం మూసి ఉంది. 2అప్పుడు యెహోవా నాతో ఈ మాట చెప్పాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి ఏ మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు. 3ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.” 4తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను.
సాయంకాల ప్రార్థన: పఠనం (శుభవార్త పండుగ కోసం)
1జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. 2పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. 3తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. 4“జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. 5తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. 6ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” 7ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. 8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. 9జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. 10జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. 11నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 24 మార్చి పౌర కాలెండర్లో 6 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు