Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 31 మార్చి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 31 మార్చి, 2027

బుధవారం · పాస్కా అష్టదినాలు

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా అష్టదినాలలో బుధవారం

మహోత్సవం · ఆరాధన రంగు: తెలుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 3:1–10

1మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. 2పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. 3పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు. 4పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. 5అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. 6అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని 7వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. 8వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. 9వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు. 10‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 105:1–4, 6–9

1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. 2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 3ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. 4యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. 6ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 7ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. 8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, 9ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

సువార్త

లూకా 24:13–35

13ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు. 14జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. 15అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. 16అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది. 17ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు. 18వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు. 19ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. 20మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా? 21ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. 22అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. 23కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. 24మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు. 25అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, 26క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు. 27ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు. 28ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది. 29దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు. 30ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు. 31అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు. 32అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు. 33అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని 34“ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని 35దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు