Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 11 ఫిబ్రవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 29 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 11 ఫిబ్రవరి, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత 37వ వారం · స్వరం 3

పండుగలు మరియు పరిశుద్ధులు

Translation of the relics of the Hieromartyr Ignatius the God-bearer, Bishop of Antioch († 107)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

యాకో 4:7–5:9

7కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. 11సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. 12ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? 13“నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది. 15కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది. 5:1ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. 2మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. 3మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు. 4చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి. 5మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. 6మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు. 7కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. 8ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి. 9సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.

పత్రిక (శుక్రవారం కోసం)

1 పేతు 1:1–2, 10–12; 2:6–10

1యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. 2తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక. 10మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. 2:6ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.” 7కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి, “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.” 8అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు. 9చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు. 10ఒకప్పుడు మీరు ప్రజ కాదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు కనికరం పొందారు.

సువార్త

మార్కు 11:27–33

27యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి 28ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు. 29యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. 30యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు. 31వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు. 32‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. 33కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

సువార్త (శుక్రవారం కోసం)

మార్కు 12:1–12

1ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు. 2పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 3అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. 4అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు. 5అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు. 6వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు. 7కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు. 8వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు. 9అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు. 10మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. 11అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’” 12ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 29 జనవరి పౌర కాలెండర్‌లో 11 ఫిబ్రవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు