హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 1 ఫిబ్రవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 1 ఫిబ్రవరి, 2027
సోమవారం · సామాన్య కాలం నాల్గవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం నాల్గవ వారపు సోమవారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
32ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు. 33విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు. 35స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు. 36ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు. 37వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు. 38అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.
ప్రతిస్పందన కీర్తన
19నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. 20మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు. 21ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక. 22నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు. 23యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
సువార్త
1వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. 2యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. 3వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. 4వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. 5వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు. 6వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. 7“యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. 8ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు. 9ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. 10అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. 11ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 12ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. 13యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. 14ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. 16అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. 17వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. 18యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. 19కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. 20అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు