Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 1 ఫిబ్రవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 19 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 1 ఫిబ్రవరి, 2027

సోమవారం · పెంతెకొస్తు తర్వాత 36వ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Venerable Macarius the Great, of Egypt († c. 390-391)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

హెబ్రీ 11:17–23, 27–31

17విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు. 20విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు. 21విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. 22విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు. 23విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు. 27విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. 28విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు. 29విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది. 30విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి. 31విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు.

పత్రిక (మంగళవారం కోసం)

హెబ్రీ 12:25–26; 13:22–25

25మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం? 26ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.” 13:22సోదరులారా మీకు సంక్షిప్తంగా రాసిన ఈ ప్రోత్సాహవాక్కును సహించమని కోరుతున్నాను. 23మన సోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరగా వస్తే అతనితో కలసి మిమ్మల్ని చూస్తాను. 24మీ అధికారులందరికీ పరిశుద్ధులందరికీ అభివందనాలు తెలియజేయండి. ఇటలీలో ఉన్నవారు మీకు అభివందనాలు చెబుతున్నారు. 25మీకందరికీ కృప తోడై ఉండు గాక.

పత్రిక (పరిశుద్ధ మహా మకారియస్ కోసం)

గలతీ 5:22–6:2

22అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. 25మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం. 6:1సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

సువార్త

మార్కు 9:42–10:1

42“కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు. 43మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. 45ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. 47అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. 48నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. 49ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు. 50ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు. 10:1యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు.

సువార్త (మంగళవారం కోసం)

మార్కు 10:2–12

2కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. 3యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. 4వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు. 5యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. 6కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. 7అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. 8వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు. 10అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. 11యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 19 జనవరి పౌర కాలెండర్‌లో 1 ఫిబ్రవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు