Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 9 జనవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · డిసెంబర్ 27 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 9 జనవరి, 2027

శనివారం · పెంతెకొస్తు తర్వాత 32వ వారం · స్వరం 6

పండుగలు మరియు పరిశుద్ధులు

జనన పండుగ తర్వాత శనివారం

క్రిస్మస్ కాలం (Svyatki)

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక (క్రీస్తు జననం తర్వాత శనివారం కోసం)

1 తిమో 6:11–16

11దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి. 15భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

పత్రిక

1 తెస్స 5:14–23

14సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. 15ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. 16ఎప్పుడూ సంతోషంగా ఉండండి. 17ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. 18ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం. 19దేవుని ఆత్మను ఆర్పవద్దు. 20ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 21అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి. 22ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి. 23శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!

పత్రిక (పరిశుద్ధ స్తెఫను కోసం)

అపొ.కా 6:8–7:5, 47–60

8స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు. 9అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని 10అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు. 11అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు. 12ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. 13అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు. 14నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు. 15సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది. 7:1ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. 2అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై 3‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు. 4“అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు. 5ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తరువాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు. 47కాని సొలొమోను మందిరం కట్టించాడు. 48“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు. 49‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది? 50ఇవన్నీ నా చేతిపనులు కావా? అని ప్రభువు అడుగుతున్నాడు.’ 51“మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. 52మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. 53దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు. 54మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. 55అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56“ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు. 57అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి 58అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. 59వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

సువార్త (క్రీస్తు జననం తర్వాత శనివారం కోసం)

మత్తయి 12:15–21

15యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. 17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, 18“ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు. 19ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు. 20న్యాయాన్ని గెలిపించే వరకూ, ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు. 21ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం.

సువార్త

లూకా 16:10–15

10చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు. 11కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు? 12మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు? 13ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు.” 14డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు. 15ఆయన వారితో ఇలా అన్నాడు. “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.

సువార్త (పరిశుద్ధ స్తెఫను కోసం)

మత్తయి 21:33–42

33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. 34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. 35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. 37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. 39వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. 40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. 41వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. 42అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 27 డిసెంబర్ పౌర కాలెండర్‌లో 9 జనవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు