హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 6 జనవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 6 జనవరి, 2027
బుధవారం · క్రిస్మస్ కాలం
పండుగలు మరియు పరిశుద్ధులు
ప్రభువు ప్రత్యక్షత పండుగ
మహోత్సవం · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. 2భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. 3రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. 4తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు. 5నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. 6ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.
ప్రతిస్పందన కీర్తన
1సొలొమోను కీర్తన దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి. 2అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక. 7అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక. 8సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక. 10తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక. 11రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక. 12ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు. 13నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.
రెండవ పఠనం
2మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు వినే వుంటారు. 3అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను. 5ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు. 6ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.
సువార్త
1హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు. 3హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. 4కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు. 5అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే, 6‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. 7అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. 8తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు. 9వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. 10ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. 11ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. 12హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు