Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 25 నవంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 12 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 25 నవంబర్, 2026

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 26వ వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

Saint John the Merciful, Patriarch of Alexandria († c. 616–620)

ఉపవాస దినం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 తిమో 1:18–20; 2:8–15

18తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు. 19అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు. 20వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను. 2:8అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. 9అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా 10భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి. 11స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది. 15అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

పత్రిక (గురువారం కోసం)

1 తిమో 3:1–13

1ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. 2కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి. 5ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి. 8అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు. 9వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి. 10మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు. 11అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి. 12పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి. 13పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.

సువార్త

లూకా 12:48–59

48దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు. 49“నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను. 50అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 51నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికే వచ్చానని మీకు చెబుతున్నాను. 52ఇక నుండి ఒక ఇంట్లో ఉండే ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు. 53తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు” అని చెప్పాడు. 54తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది. 55దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది. 56కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు. 57ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు? 58మీపై నేరారోపణ చేసే వాడితో కలసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను జైల్లో పెడతాడు. 59చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను.” అన్నాడు.

సువార్త (గురువారం కోసం)

లూకా 13:1–9

1కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు. 2అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా? 3కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. 4అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా? 5కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.” 6తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు. 7దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు. 8అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి, 9అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 12 నవంబర్ పౌర కాలెండర్‌లో 25 నవంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు