Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 21 నవంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 21 నవంబర్, 2026

శనివారం · సామాన్య కాలం 33వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 33వ వారపు శనివారం

స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు

దేవాలయంలో ధన్య కన్య మరియ సమర్పణ · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ప్రక 11:4–12

4భూమికి ప్రభువైన వాని సన్నిధిలో ఉండే రెండు ఒలీవ చెట్లు, రెండు దీపస్తంభాలు వీరే. 5ఎవరైనా వీరికి హని చేయాలని చూస్తే, వారి నోటి నుండి అగ్ని జ్వాలలు బయల్దేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి. 6తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది. 7వారు తమ సాక్షాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది. 8వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు. 9మనుషుల్లో, అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృత దేహాలను చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు. 10ఈ ఇద్దరు ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు గనక వారికి పట్టిన గతిని చూసి వారంతా సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు. 11కాని మూడున్నర రోజులైన తరువాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి తమ కాళ్ళపై నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది. 12అప్పుడు, “ఇక్కడికి పైకి రండి” అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 144:1–2, 9–10

1దావీదు కీర్తన నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే. 2నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే. 9దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను. 10రాజులకు విజయం ఇచ్చేది నువ్వే. దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే.

సువార్త

లూకా 20:27–40

27పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు. 28“బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా, 29ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు. 30రెండవవాడు, మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు. 31ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు. 32ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది? 33ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా” అన్నారు. 34అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ, 35పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు. 36వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు. 37మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా, 38ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు. 39ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు