Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 21 నవంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 8 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 21 నవంబర్, 2026

శనివారం · పెంతెకొస్తు తర్వాత 25వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Synaxis of the Chief of the Heavenly Hosts, Archangel Michael and the Other Heavenly Bodiless Powers: Archangels Gabriel, Raphael, Uriel, Selaphiel, Jehudiel, Barachiel, and Jeremiel

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

యెహో 5:13–15

13యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. 14అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. 15అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

న్యాయా 6:2, 7, 11–24

2మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు. 7మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు 11అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, 12యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, 13గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు. 14అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. 15అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు. 16అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు. 17అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు, 18నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు. 19అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. 20దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు. 21అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. 22గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు. 23అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు. 24అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెష 14:7–20

7భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది. వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు. 8నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు సంతోషిస్తూ ఇలా అంటాయి, ‘నువ్వు ఓడిపోయినప్పట్నుంచి చెట్లు నరికే వాడెవడూ మమ్మల్ని నరకడానికి మా మీదకు రాలేదు.’ 9నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది. 10వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. 11నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి. 12తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు? 13నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, 14మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. 15అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు. 16నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిదానించి చూస్తూ ఇలా అంటారు, 17‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’ 18జాతులన్నిటి రాజులందరూ ఘనత వహించినవారై తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు. 19కానీ నువ్వు పారేసిన కొమ్మలా ఉన్నావు. కత్తివాత చచ్చిన శవాలు నిన్ను కప్పుతున్నాయి. అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయిన వాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి. నువ్వు తొక్కేసిన పీనుగులా అయ్యావు. 20నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను హతం చేశావు. వాళ్ళతో పాటు నువ్వు సమాధిలో ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకానికి రాదు.

ఉదయ ప్రార్థన: సువార్త

మత్తయి 13:24–30, 36–43

24ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది. 25మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. 26మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. 27అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. 28‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు. 29అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కలను పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో. 30కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.” 36అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

పత్రిక (దూతల కోసం)

హెబ్రీ 2:2–10

2ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. 4దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు. 5మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు. 6దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? 7నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. 8నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు. 9అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు. 10ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే.

సువార్త (దూతల కోసం)

లూకా 10:16–21

16మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.” 17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు. 21ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 8 నవంబర్ పౌర కాలెండర్‌లో 21 నవంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు