Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 12 నవంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 12 నవంబర్, 2026

గురువారం · సామాన్య కాలం 32వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 32వ వారపు గురువారం

స్మరణ దినం · ఆరాధన రంగు: ఎరుపు

పునీత జోసఫాట్, పీఠాధిపతి, హతసాక్షి · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఫిలే 1:7–20

7సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది. 8అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ, 9ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను. 10నేను నా బిడ్డ ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు. 11గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు. 12నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. 13నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీ పక్షాన నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను 14అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనాన్ని బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. 15బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు. 16ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు. 17అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో. 18ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి. 19పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు. 20ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 146:7–10

7దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు. 8యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు. 9ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు. 10యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.

సువార్త

లూకా 17:20–25

20ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 21ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు. 22ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు. 23వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు. 24ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు. 25అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు