హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 13 నవంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 13 నవంబర్, 2026
శుక్రవారం · సామాన్య కాలం 32వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 32వ వారపు శుక్రవారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఉపవాసం మరియు పశ్చాత్తాపం
పశ్చాత్తాప దినం
ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
4తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 5అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 6ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. 7యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. 8మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి. 9క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు.
ప్రతిస్పందన కీర్తన
1ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు. 2ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు. 10నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు. 11నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను. 17నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. 18నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.
సువార్త
26“నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. 27నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది. 28లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు. 30“అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. 34నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. 35ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.” 36అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. 37దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు